: నిన్న కోర్టు మెట్లు!... నేడు ఠాణాకు!: కొడిగడుతున్న సోనియా గాంధీ ప్రాభవం!
దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కోడలుగా, మరో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అర్ధాంగిగా... తాజాగా గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు అధినేత్రిగా సోనియా గాంధీది నిన్నటిదాకా రాచఠీవి. 15 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీ... ఆ పార్టీకి అత్యధిక కాలం అధినేత్రిగా కొనసాగిన రికార్డును సొంతం చేసుకున్నారు. పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన యూపీఏకు చైర్ పర్సన్ హోదాలో ఆమె అనధికార ప్రధానిగా కొనసాగారన్న వాదనా లేకపోలేదు. అయితే,ఈ ప్రాభవమంతా నిన్నటిదాకానే. క్రమంగా సోనియా గాంధీ తన ప్రాభవం కోల్పోతున్నారు. వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. దేశీయ కోర్టు వివాదాల్లో చిక్కుకున్న సోనియా... తన సొంత దేశం ఇటలీకి చెందిన ఓ కోర్టు ఇచ్చిన తుది తీర్పులోనూ ప్రస్తావనకు వచ్చారు. బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి రంగంలోకి దిగడంతోనే సోనియా గాంధీకి కష్టాలు మొదలయ్యాయని చెప్పొచ్చు. నేషనల్ హెరాల్డ్ కేసును తిరగదోడిన స్వామి... సోనియా గాంధీతో పాటు ఆమె కుమారుడు రాహుల్ గాంధీలను కోర్టు మెట్లెక్కించారు. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సోనియా, రాహుల్ గాంధీలు తమ జీవితంలోనే తొట్ట తొలిసారి కోర్టు మెట్లెక్కారు. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు తల్లీకొడుకులు నడక ప్రారంభించగా, వారి వెంట ఆ కేసులో ఆరోపణలు ఎదర్కొన్న మోతీలాల్ వోరాలాంటి రాజకీయ కురువృద్ధులు కూడా కోర్టు బాట పట్టారు. కోర్టులో రెండంటే రెండు నిమిషాలు మాత్రమే ఉన్నా... తమ జీవిత చరిత్రలోనే తొలిసారి కోర్టు మెట్లెక్కిన తీరు వారిని షాక్ కు గురి చేసింది. తాజాగా అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణాన్ని కేంద్రంగా చేసుకుని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడిని తిప్పికొట్టే క్రమంలో ‘సేవ్ డెమోక్రసీ’ పేరిట సోనియా, రాహుల్ చేపట్టిన వినూత్న నిరసన వారిని పోలీస్ స్టేషన్ లో కాలు పెట్టేలా చేసింది. నేటి ఉదయం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన కాంగ్రెస్ ఆందోళనను అడ్డుకున్న పోలీసులు... సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కూడా అరెస్ట్ చేశారు. అక్కడికి సమీపంలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వెరసి నరేంద్ర మోదీ సర్కారుపై ఎదురు దాడి చేసేందుకు చేపట్టిన ఉద్యమం వారిని పోలీస్ స్టేషన్ గడప తొక్కేలా చేసింది.