: ట్రంప్ జాతకం చెప్పిన రాంగోపాల్ వర్మ
వర్మ దారే వేరు. పవన్ కల్యాణ్ ను ఏదైనా అంటే అభిమానులు ఊరుకోవడం లేదని ఆయన్ని వదిలేసి, ఇటీవల రజనీకాంత్ మీద పడ్డాడు. రజనీ అభిమానులు కూడా గయ్యిమనేసరికి మళ్లీ పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేశాడు. ఈసారి తన కామెంట్లకు సెటైర్లు రాకూడదని అనుకున్నాడో ఏమో కానీ అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు జ్యోతిష్య వేత్తగా మారాడు. ఎడ్డెం అంటే తెడ్డెం అనే వర్మ ట్రంప్ జాతకంలో కూడా తన పంథా వీడకపోవడం విశేషం. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైతే అమెరికా భవిష్యత్ అంధకారమేనని సర్వేలు గగ్గోలు పెడుతున్నాయి. ట్రంప్ అధికారంలో ఉంటే అమెరికా జీడీపీ 2కి పడిపోతుందని ఫైనాన్షియల్ సంస్థలు ఆందోళన చెందుతున్న తరుణంలో వర్మ మాత్రం సానుకూలంగా స్పందించాడు. ఎందుకో, ట్రంప్ అమెరికా అధ్యక్షుల్లో గొప్ప అధ్యక్షుడిగా చరిత్రలో నిలిచిపోతారనిపిస్తోందని ట్వీట్ చేశాడు. అమెరికా చరిత్రలో నిలిచిపోయిన జాన్ ఎఫ్ కెన్నెడీ, అబ్రహాం లింకన్ ల సరసన చరిత్రలో డొనాల్డ్ ట్రంప్ నిలిచిపోతాడనిపిస్తోందని రాంగోపాల్ వర్మ పేర్కొన్నాడు.