: వైసీపీ బాటలో కాంగ్రెస్!... బీజేపీ వైఖరికి నిరసనగా నేడు ఢిల్లీలో ‘సేవ్ డెమోక్రసీ’ ర్యాలీ
వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ... నిజంగా గ్రాండ్ ఓల్డ్ పార్టీనే. దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పాలించిన ఆ పార్టీకి ఆందోళనల విషయంలో పెద్దగా అనుభవం లేదనే చెప్పాలి. ప్రస్తుతం విపక్షంలో కూర్చున్న ఆ పార్టీపై అధికారంలోని బీజేపీ ముప్పేట దాడి చేస్తోంది. ఈ దాడిని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పట్టక తప్పలేదు. ఇప్పటికే పలుమార్లు నిరసనలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ... తాజాగా అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంపై అధికార పక్షం చేస్తున్న దాడిని తిప్పికొట్టే క్రమంలో ప్రాంతీయ పార్టీలు అనుసరిస్తున్న ఉద్యమ రీతులను ఆ పార్టీ కాపీ కొట్టేస్తోంది. ఏపీలో తన టికెట్లపై గెలిచి టీడీపీలో చేరుతున్న ఎమ్మెల్యేల వ్యవహారం వైసీపీకి తల భారంగా మారింది. ఈ క్రమంలో టీడీపీ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘సేవ్ డెమోక్రసీ’ పేరిట సరికొత్త తరహాలో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లిన ఆయన అక్కడ కూడా ఉద్యమాన్ని కొనసాగించారు. జగన్ చేసిన ‘సేవ్ డెమోక్రసీ’ ఉద్యమంపై నేషనల్ మీడియా బాగానే ప్రచారం చేసింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా వైసీపీ బాటలోనే నడిచేందుకు సిద్ధమైంది. అగస్టా కుంభకోణంలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఆ పార్టీపై బీజేపీ ముప్పేట దాడి చేస్తోంది. ఈ దాడిని తిప్పికొట్టేందుకు నేడు ఢిల్లీలో ‘సేవ్ డెమోక్రసీ’ పేరిట కాంగ్రెస్ పార్టీ భారీ నిరసనను చేపట్టనుంది. జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న ఈ ర్యాలీలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులతో పాటు ఆ పార్టీ ఎంపీలు, పెద్ద సంఖ్యలో నేతలు హాజరు కానున్నారు.