: హిందాన్ ఎయిర్ బేస్ లోకి ఉగ్రవాదులు... ఎయిర్ బేస్ మూసివేత, ముమ్మర సోదాలు చేస్తున్న పోలీసులు
భారత్ లోని ఎయిర్ బేస్ లను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు పెద్ద ప్లానే వేసినట్లున్నారు. ఈ ఏడాది ప్రారంభమైన రెండో రోజునే (జనవరి 2) పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు ఏడుగురు గరుడ కమెండోలను పొట్టనబెట్టుకున్నారు. నాటి ఘటనలో ఉగ్రవాదుల మెరుపు దాడిపై గరుడ కమెండోలు వేగంగా స్పందించి వారిని మట్టుబెట్టడంతో ఎయిర్ బేస్ కు చిన్నపాటి నష్టం కూడా జరగలేదు. తాజాగా నిన్న రాత్రి ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాదులోని హిందాన్ ఎయిర్ బేస్ లో కలకలం రేగింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మొహ్మద్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఎయిర్ బేస్ లోకి ప్రవేశించారన్న వార్తలతో అక్కడ కలకలం రేగింది. ఉగ్రవాదులుగా కనిపిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఎయిర్ బేస్ లోకి ప్రవేశించారన్న సమాచారం అందుకున్న ఎయిర్ బేస్ భద్రతా సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగారు. ఎయిర్ బేస్ ప్రధాన గేట్లను మూసివేసి, ఉద్యోగులను ఇళ్లు వదిలి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు ఎయిర్ బేస్ ను జల్లెడ పడుతున్నారు. ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు.