: ఇలాంటి కేసులు గతంలో చూడలేదని విస్తుపోతున్న పాకిస్థాన్ వైద్యులు
అంతుపట్టని రహస్యాలు ఎన్నో ఛేదనకు నోచుకోకుండా ఉన్నాయి. తాజాగా పాకిస్థాన్ లో వెలుగులోకి వచ్చిన ముగ్గురు అన్నదమ్ములను చూసి పాకిస్ధాన్ లో స్పెషలిస్టు వైద్యులు షాక్ తిన్నారు. వివరాల్లోకి వెళితే... పాకిస్థాన్ లోని క్వెట్టాకు 15 కిలోమీటర్ల దూరంలో వుండే ఇలియాస్ హషీమ్ (13), రషీద్ (9), షోయబ్ (1) సోదరులు సూర్యోదయం ప్రారంభమవుతోందనగానే ఉత్సాహం పుంజుకుంటారు. సూర్యాస్తమయం మొదలువుతోందనగానే డీలా పడిపోతారు. కదలలేని నిస్తేజ స్థితికి చేరుకుంటారు. మళ్లీ మరుసటి రోజు ఇదే తంతు. దీంతో వీరిని వారి గ్రామస్తులు సోలార్ కిడ్స్ గా సంబోధిస్తున్నారు. దీంతో వీరిని ఇస్లామాబాద్ లోని పాకిస్థాన్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్) లో చికిత్స కోసం చేర్చారు. అయితే, ఇటువంటి కేసును గతంలో ఎన్నడూ చూళ్లేదని పిమ్స్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జావెద్ అక్రమ్ తెలిపారు. వీరికి పరీక్షలు నిర్వహించేందుకు 9 మంది వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. వీరి రక్త నమూనాలు, రిపోర్టులు ప్రపంచంలోని అత్యుత్తమ 13 వైద్య పరిశోధన కేంద్రాలకు పంపినట్టు వెల్లడించారు. వీరిపై వందలాది పరీక్షలు నిర్వహించినా ఎలాంటి ఫలితాలు లేవని, తాజాగా జరిపిన పరీక్షలతో అత్యంత అరుదైన మస్తీనియా సిండ్రోమ్ గా దీనిని భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 600 మందికి ఈ వ్యాధి సోకినట్టు తెలుస్తోంది.