: పత్తికోళ్లలంకలో మరోమారు హైటెన్షన్!... అమల్లోకి వచ్చిన 144 సెక్షన్!
పశ్చిమగోదావరి జిల్లా పత్తికోళ్లలంకలో మారోమారు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామ పరిధిలోని చేపల చెరువుల హక్కులకు సంబంధించి గ్రామం రెండు వర్గాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రెండు వర్గాల మధ్య భౌతిక దాడులు కూడా చోటుచేసుకున్నాయి. ఆ సందర్భంగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసుల రంగప్రవేశంతో గ్రామంలో పరిస్థితులు అదుపులోకి వచ్చినా... నిన్న ఓ వర్గానికి చెందిన 16 మంది వ్యక్తులు వివాదంలో ఉన్న చెరువులో చేపలు పట్టేందుకు యత్నించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రెండో వర్గం పోలీసులకు సమాచారాన్ని చేరవేసింది. దీంతో మరోమారు రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. పోలీసుల చర్యపై బాధిత వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో గ్రామంలో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదముందన్న భావనతో ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు 144 సెక్షన్ ఆంక్షలను విధించారు.