: ‘5’ను నమ్ముకున్న ‘అమ్మ’!... మేనిఫెస్టో విడుదలలో అన్నీ ‘5’ వచ్చేలా జాగ్రత్తపడ్డ జయలలిత!


అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సంఖ్యాశాస్త్రమంటే అపార నమ్మకం. ఆమెకు అచ్చొచ్చిన సంఖ్య ఒకటి కాదు... నాలుగున్నాయి. అవే... 2, 5, 6, 9. ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను జయ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్రానికి ఐదు సార్లు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జయలలిత... తాజా ఎన్నికల్లోనూ విజయం సాధించి ఆరోసారి కూడా తమిళ సీఎం పీఠాన్ని అధిరోహించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో తనకు అచ్చొచ్చిన నాలుగు అంకెల్లోని ‘5’ను ఆమె తన లక్కీ నెంబర్ గా పరిగణిస్తున్నారు. ఈ మేరకు నిన్న అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల సందర్బంగా ప్రతి అంశంలో ఈ ‘5’ వచ్చేలా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అవేంటంటే... వారంలో ఐదో రోజైన గురువారాన్ని ఎంచుకున్న జయలలిత... ఆ రోజు తేదీ, నెల కూడా ‘5’ వచ్చేలా చూసుకున్నారు. ఇక మేనిఫెస్టో విడుదల వేదికపై కూడా తనతో కలిపి మొత్తం ఐదుగురే ఉండేట్లు జయ చూసుకున్నారు. మేనిఫెస్టో పుస్తకాన్ని 41 పేజీలతో ముద్రించారు. ఈ సంఖ్యలోని రెండు అంకెలను కలిపితే... ‘5’ వస్తుంది. ఇక మేనిఫెస్టోలోని అంశాల సంఖ్య 50గా ఉంది. ఈ సంఖ్యలోని అంకెలను కూడితే కూడా ‘5’ వస్తుంది. ‘5’ను నమ్ముకుని ముందుకెళుతున్న ‘అమ్మ’కు ఆ అంకె ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.

  • Loading...

More Telugu News