: టీడీపీని వదిలించుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నమే తాజా వ్యాఖ్యలు: టీకాంగ్ నేత అద్దంకి దయాకర్


టీడీపీని వదిలించుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే కేంద్ర మంత్రులు ఆ రాష్ట్రానికి ప్రత్యేకహోదా లేదని పార్లమెంటు సాక్షిగా వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తెలిపారు. హైదరాబాదులో ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, బీజేపీ నేతలు విభజన చట్టంలో ప్రత్యేకహోదా అంశం లేదని చెబుతున్నారని, ఏడు మండలాలను ఏపీలో కలపాలన్న విషయం విభజన చట్టంలో ఉందా? అని ఆయన అడిగారు. విభజన చట్టంలో అది లేనప్పుడు ఎలా కలిపారని ఆయన ప్రశ్నించారు. అదే రీతిలో ఏపీకి ప్రత్యేకహోదా కల్పించవచ్చని ఆయన అన్నారు. నీతి ఆయోగ్ రాజ్యాంగాతీత శక్తా? అని ఆయన ప్రశ్నించారు. గతంలో ప్రత్యేకహోదా కల్పించిన రాష్ట్రాలన్నింటికీ నీతి ఆయోగ్ హోదా ఇవ్వాలని చెప్పిందా? అని ఆయన అడిగారు. లేకపోతే రాజ్యాంగంలో ఏపీకి ప్రత్యేకహోదా కల్పించేందుకు అవకాశంలేని ఆర్టికల్ ఏదైనా ఏర్పాటు చేశారా? అని ఆయన అడిగారు. ప్రత్యేకహోదా కల్పించడం అనేది రాజకీయ నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. టీడీపీతో ఉపయోగం లేదని భావిస్తున్న బీజేపీ ఆ పార్టీని వదిలించుకునేందుకు చేస్తున్న ప్రయత్నమే తాజా ప్రకటనలని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News