: ‘హోదా’ రాదన్న జయంత్ పై ఏపీ ప్రజల ఆగ్రహం!... చెప్పుకోలేని మాటలంటున్నారని కేంద్ర మంత్రి ఆవేదన!
ఏపీకి ప్రత్యేక హోదా రాదని మొన్నటికి మొన్న ప్రకటించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌధురిపై రాజకీయ నేతలు విరుచుకుపడితే... అసలు ఏపీకి ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని వివరించిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాపై ఏపీ ప్రజలు బెదిరింపులకు దిగుతున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి సోషల్ మీడియా నెట్ వర్క్ సైట్లన్నిటిలో ... ఏపీ ప్రజలు పంపిన నిందలు, తిట్లు, బెదిరింపులకు సంబంధించిన సందేశాలే ఉన్నాయట. సదరు మెసేజ్ లను చూసిన జయంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘నేనేం తప్పు చేశాను? చట్టంలో ఉన్న అంశాలనే చెప్పాను. నా సోషల్ మీడియా నెట్ వర్క్ సైట్లన్నీ ఏపీ ప్రజల సందేశాలతోనే నిండిపోయాయి. ఏపీకి వచ్చే సాహసం చేయకండి అనే హెచ్చరికలు కూడా అందులో ఉన్నాయి. ఇంకా చెప్పలేని మాటలు కూడా అందులో ఉన్నాయి’’ అని ఆయన నిన్న ఒకింత ఆవేదనాభరిత వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చట్టంలో లేదు. అదే విషయాన్ని స్పష్టం చేశా. ఇందులో నా తప్పేముంది?’’ అని జయంత్ అన్నారు.