: వారు తల్లిని చంపి బిడ్డను తీశారు... మీరు ఆ బిడ్డను చంపుతారా?: బీజేపీకి జూపూడి సూటి ప్రశ్న


యూపీఏ ప్రభుత్వం తల్లిని చంపి బిడ్డను తీస్తే, బీజేపీ ఆ బిడ్డను చంపేస్తుందని టీడీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు పదేపదే కేంద్రాన్ని కోరుతున్నారని, ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇస్తున్నారని, లేఖలు కూడా రాస్తున్నారని అన్నారు. అయినా సరే బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేయాలని భావిస్తోందని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రధాని చెప్పే ప్రతి మాటను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ కు ఐదేళ్లు కాదు, పదేళ్లు హాదా ఇవ్వాలంటూ నాడు రాజ్యసభలో వెంకయ్య నాయుడు డిమాండ్ చేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. పార్లమెంటులోని జీరో అవర్ లో కేంద్ర మంత్రులు బాధ్యతారాహిత్య ప్రకటనలు చేస్తున్నారని ఆయన చెప్పారు. అసలు బీజేపీ ఉద్దేశ్యమేంటని ఆయన నిలదీశారు. బీజేపీ, టీడీపీ మధ్యనున్న స్నేహాన్ని కేంద్రం చెడగొట్టాలని భావిస్తోందా? అని ఆయన అడిగారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి పెంచి రాష్ట్రానికి ప్రత్యేకహోదా తెచ్చేలా పోరాడాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News