: అంతగా క్రమశిక్షణ లేని రాజకీయాలతో కొంచెం ఇబ్బంది పడుతున్నాను: ఉత్తమ్ కుమార్ రెడ్డి
తాను అత్యంత క్రమశిక్షణ ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసానని, అయితే, రాజకీయాల్లో ఆ స్థాయి క్రమశిక్షణ ఉండదని, దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి ఎంతో చరిత్ర ఉందని, అటువంటి పార్టీకి తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిగా ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఎంత ఉండాలో అంత ఉందన్నారు. టీఆర్ఎస్, టీడీపీ, వైఎస్సార్సీపీలు కుటుంబ పార్టీలని, కాంగ్రెస్ పార్టీ మాత్రం అటువంటిది కాదని అన్నారు. ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ అని, అటువంటి ఏ పార్టీలోనైనా పలు అభిప్రాయాలు ఉంటాయన్నారు. అదే పద్ధతిలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని చెప్పారు. క్రమశిక్షణ విషయంలో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేదని అందరూ సమానమేనని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో తనకు ఎటువంటి విభేదాలు లేవని, కోమటిరెడ్డి వ్యవహారాన్ని హైకమాండ్ చూసుకుంటుందని అన్నారు. పీసీసీ చీఫ్ గా తాను పూర్తికాలం ఉంటానని, ఈ పదవిని హైకమాండే తనకు పిలిచి ఇచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.