: హోదా కోసం అన్ని కలెక్టరేట్ల ముందు ఈనెల 10న ధర్నాలు, తూర్పుగోదావరిలో జగన్ పాల్గొంటారు: బొత్సా సత్యనారాయణ
బీజేపీ నేతలు ఏపీకి ప్రత్యేక హోదాపై రోజుకో మాట మాట్లాడుతున్నారని వైఎస్సార్ సీపీ నేత బొత్సా సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదాపై అన్ని కలెక్టరేట్ల ముందు ఈనెల 10న ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ధర్నాలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పాల్గొంటారని తెలిపారు. ‘రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా.. మీ పార్టీ వ్యక్తిగత లాభాలే ముఖ్యమా..?’ అని సీఎం చంద్రబాబుని బొత్సా ప్రశ్నించారు. హోదాపై చంద్రబాబు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదాపై తమ నాయకుడు జగన్ ఢిల్లీలో ధర్నా చేసిన విషయాన్ని బొత్సా గుర్తుచేశారు. ‘ఈనెల 10న కేంద్రం దిగి వచ్చేలా అందరం స్పందించి, సకలం బంద్ చేద్దాం’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చాటి చెబుదామని అన్నారు. హోదాకోసం పార్లమెంట్ పై ఒత్తిడి తీసుకొద్దామని పిలుపునిచ్చారు. హోదా విషయంలో మోదీ, వెంకయ్య తీరుపై ఆయన మండిపడ్డారు. మన హక్కును మనం సాధించుకుందామని వ్యాఖ్యానించారు.