: పవన్ కల్యాణ్ మాట్లాడాలి.. ఏపీ పార్లమెంట్ సభ్యులు రాజీనామా చెయ్యాలి: ‘హోదా’పై విశాఖ, విజయవాడలో నిరసనలు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ విజయవాడ, విశాఖలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రమంత్రి జయంత్ సిన్హా నిన్న ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్, విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదంటూ చేసిన ప్రకటనపై విజయవాడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బీజేపీకి, వెంకయ్యనాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రం ఏపీని మోసం చేసిందంటూ విమర్శిస్తున్నారు. పవన్ కల్యాణ్, నరేంద్ర మోదీ, వెంకయ్యనాయుడు రాష్ట్ర ప్రజల సంక్షేమంపై ఎన్నో మాటలు చెప్పారని, హోదా లేదంటూ చేసిన ప్రకటనపై ఇప్పుడు వారు ఏం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, విజయవాడ కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా మోదీ మాట ఇచ్చారని, నిన్నటి బీజేపీ ప్రకటన సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు. హోదా విషయంలో ఏపీ పాలక పక్షం మెతక వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. మరికాసేపట్లో విజయవాడలో గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నేతలు పాలాభిషేకం చేయనున్నారు. మరోవైపు విశాఖపట్నంలో అంబేద్కర్ జంక్షన్లో విద్యార్థి జేఏసీ ఆందోళన చేస్తోంది. కేంద్రం ప్రకటనను వెనక్కి తీసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తోంది.