: పదేళ్ల బాలుడికి రూ.6.6 లక్షలు బహూకరించిన ఫేస్‌బుక్
తమ వెబ్‌సైట్‌లో ఉన్న లోపాలను తొలగించడానికి ఫేస్‌బుక్ సంస్థ బగ్ బౌంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దీనిలో పాల్గొంటున్న సాఫ్ట్‌వేర్ నిపుణులు, యువత ఫేస్‌బుక్‌లో లోపాలను గుర్తిస్తూ ఆ వెబ్‌సైట్ నిర్వాహకుల నుంచి భారీగా నగదు బహుమతులు పొందుతున్నారు. తాజాగా ఓ పదేళ్ల బుడతడు కూడా ఫేస్‌బుక్ నుంచి నజరానా అందుకున్నాడు. ఫేస్‌బుక్ అనుబంధ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో బగ్‌ను కనుగొన్నందుకుగానూ ఓ పదేళ్ల బాలుడు సదరు సంస్థనుంచి 10వేల డాలర్లు(రూ.6.6లక్షలు) బహుమానంగా పొందాడు. బగ్‌ను కనుగొన్నందుకు ఈ నజరానాను అందుకున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఫిన్‌లాండ్‌కు చెందిన ఈ బాలుడి పేరు జానీ. ఇన్‌స్టాగ్రామ్‌లో సెక్యూరిటీ లోపాన్ని కనుగొని, దానికి పరిష్కారం కనుగొన్నాడు. ఈ బాలుడు గుర్తించిన బగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్‌ను, కామెంట్లను డిలేట్ చేయడానికి అనువుగా ఉన్న లోపంతో ఉంది. దానికి చక్కని పరిష్కారాన్ని సైతం కనుగొన్నాడు జానీ. అనంతరం తాను కనుగొన్న బగ్‌తో పాటు దానికి పరిష్కార మార్గాన్ని తెలుపుతూ ఫేస్‌బుక్‌కు మెయిల్ చేశాడు. దీంతో జానీకి ఫేస్‌బుక్ ఏకంగా 10వేల డాలర్ల బహుమతి ప్రకటించింది.