: దేశంలో వ్యవసాయం బాగుండాలని కోరుకున్నాను: తిరుమల శ్రీవారి సేవలో నితిన్ గడ్కరీ
దేశంలో వ్యవసాయం బాగుండేలా చూడమని తిరుమల శ్రీవారిని ప్రార్థించానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గడ్కరీతో పాటు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు, టీటీడీ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను మంత్రులకు అందజేశారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ, దేశంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని, తాగునీటి అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. దేశ వ్యాప్తంగా వర్షాలు బాగా కురవాలని దేవుడిని ప్రార్థించానని గడ్కరీ చెప్పారు.