: మరో రాజీనామా లేఖను పంపిన విజయ్ మాల్యా ... ఆమోదించిన రాజ్యసభ ఛైర్మన్!
దేశంలోని బ్యాంకుల నుంచి వేలాదికోట్ల రుణాలను తీసుకుని, వాటిని చెల్లించకుండా లండన్ చెక్కేసిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా తన రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ హమీద్ హన్సారీ ఆమోదించారు. ఈ మేరకు మాల్యా మొదట పంపిన రాజీనామా లేఖ నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా లేదని, పైగా దానిపై ఆయన సంతకం కూడా లేదని పేర్కొంటూ దానిని తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాల్యా నిబంధనలకు అనుగుణంగా ఈ నెల మూడున మరో రాజీనామా లేఖను పంపడంతో దానిని ఛైర్మన్ ఆమోదించారని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ తెలిపారు. రుణాల ఎగవేతదారుడిగా పేరు తెచ్చుకుని, చెప్పాపెట్టకుండా దేశం నుంచి ఉడాయించిన మాల్యా రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంటు ఎథిక్స్ కమిటీ ఇటీవల సూచించిన నేపథ్యంలో, మాల్యా తనకు తానుగా తన సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి విదితమే!