: మోసం చేశావు కనుక నువ్వే చావు!: ప్రియుడితో పురుగుల మందు తాగించిన ప్రియురాలు
ఓ ప్రియుడికి ప్రియురాలు కఠినమైన శిక్ష విధించిన ఘటన గుంటూరు జిల్లా ఈపూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఈపూరుకు చెందిన మద్దం వెంకటేష్ (24) తన నివాస ప్రాంతానికి దగ్గర్లో ఉండే యువతితో రెండేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వారి వివాహానికి వెంకటేష్ తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం మేనమామ కుమార్తెను వెంకటేష్ శుక్రవారం వివాహం చేసుకున్నాడు. మరుసటి రోజు ప్రియురాలి సోదరులు చిట్టేటి శ్రీను, నాగేంద్రబాబులు పార్టీ చేసుకుందామంటూ పిలిచారు. ముగ్గురూ పార్టీ చేసుకున్నారు. పార్టీ ముగిసిన తరువాత తమ అక్కను ప్రేమించి, ఎందుకు పెళ్లి చేసుకోలేదంటూ వారు వాగ్వాదానికి దిగారు. అంతలోనే తమ అక్కను 'ఏం చేస్తావో నీ ఇష్టం' అంటూ ఆమెను తీసుకొచ్చి అతని దగ్గర వదిలి వెళ్లిపోయారు. ప్రేమించి మోసం చేశావంటూ నిందించిన ప్రియురాలు, పెళ్లి ఎలాగూ చేసుకోలేదు, కనీసం చావులోనైనా కలిసి ఉందామని ప్రతిపాదించింది. దీంతో ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలనే అంగీకారానికి వచ్చారు. అనంతరం పురుగుల మందు తీసుకుని ఒక రహస్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వెంకటేష్ రెండు గ్లాసుల పురుగుల మందు తాగాడు. తన వంతు వచ్చేసరికి ప్రియురాలు యూటర్న్ తీసుకుంది. 'నేనెందుకు చావాలి?' అని ఎదురు ప్రశ్నించింది. పైగా త్వరలో తనకు ప్రభుత్వ ఉద్యోగం రానుందని తెలిపింది. 'ప్రేమించి మోసం చేసినందుకుగాను నువ్వే చావు' అనేసి, అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో అప్పటికే రెండు గ్లాసుల పురుగుల మందు తాగిన వెంకటేష్ ఇంటికి చేరుకున్నాడు. కడుపునొప్పితో మెలితిరుగుతున్న అతడిని చూసి ఇంట్లో వాళ్లు ఏమైందని అడిగేసరికి, జరిగిన విషయం మొత్తం వివరించాడు. దీంతో అతనిని హుటాహుటీన వినుకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఫలితం లేకపోవడంతో అక్కడి నుంచి నరసారావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడా ఉపయోగం లేకపోవడంతో అతనిని గుంటూరులోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి వెంకటేష్ మృతి చెందాడు. దీంతో అతని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. కాగా, అతని ప్రియురాలు ప్రస్తుతం పరారీలో ఉంది.