: అవసరమైతే హోదా కోసం సహాయనిరాకరణ ఉద్యమం చేపడతాం: చలసాని శ్రీనివాస్
కేంద్రమంత్రి జయంత్ సిన్హా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపీలోని ప్రతిపక్షపార్టీల నేతలు, పలువురు ప్రముఖుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే సహాయనిరాకరణ ఉద్యమం చేపడతామని ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ హెచ్చరించారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ భాగమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కేంద్రం గుర్తించాలని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తూ నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రంలో జరిగే పరిణామాలకు భారతీయ జనతా పార్టీదే బాధ్యత అని హెచ్చరించారు. హోదాపై ఉద్యమం తప్పదని అన్నారు.