: దటీజ్ గోవా పోలీస్... హెల్మెట్ ధరించలేదని కారు డ్రైవర్ కు చలానా!
ఓ పోలీస్ అధికారి నిర్వాకం గోవా పోలీసుల పరువు ప్రతిష్ఠలను దిగజార్చిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...గోవాలోని పనాజీ సమీపంలోని కోల్వా బీచ్ సమీపంలోని ఓ గ్రామంలో ఏక్ నాథ్ అనంత్ పాల్కర్ అనే వ్యక్తి కారు నడుపుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో ఆ కారును ట్రాఫిక్ ఎస్సై ఎస్ఎల్ హనుషికట్టి అడ్డుకున్నారు. కారు డ్రైవర్ కి మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 177 ప్రకారం హెల్మెట్ లేదంటూ చలానా రాశారు. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది. మోటారు వాహన చట్టంలో 177 సెక్షన్ ప్రకారం ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించకపోయినా, లైసెన్స్ లేకపోయినా చలానా రాస్తారు. కారులో ప్రయాణించే వ్యక్తి హెల్మెట్ ఎలా పెట్టుకుంటాడంటూ విమర్శలు రేగాయి. అయితే ఆయన పొరపాటుగా అలా రాసి ఉంటారని పోలీసు శాఖ సమర్ధించుకుంది. కారు డ్రైవర్ కు హెల్మెట్ పెట్టుకోలేదని చలానా రాసే మూర్ఖులు ట్రాఫిక్ పోలీసులలో ఉండరని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించడం విశేషం.