: బావ భూమా వెంటే ఎస్వీ అడుగులు!... సొంత గూటికి చేరుతున్న ఎస్వీ ఫ్యామిలీ!


ఏపీలో అధికార పార్టీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది. గడచిన ఎన్నికల్లో జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ సీట్లు ఉండగా... సత్తా చాటిన వైసీపీ 11 ఎమ్మెల్యే సీట్లతో పాటు ఎంపీ సీట్లను క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఆదిలోనే వైసీపీకి ఝలక్కిచ్చిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి... టీడీపీకి చేరువయ్యారు. ఆ తర్వాత కర్నూలు ఎంపీగా గెలిచిన బుట్టా రేణుక కూడా టీడీపీ దరికి చేరినా...ఆ తర్వాత తిరిగి వైసీపీలోనే కొనసాగుతున్నారు. తాజాగా టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి (నంద్యాల), భూమా అఖిలప్రియ(ఆళ్లగడ్డ), మణిగాంధీ(కోడుమూరు), బుడ్డా రాజశేఖరరెడ్డి(శ్రీశైలం) టీడీపీలో చేరిపోయారు. ఇక దివంగత వైసీపీ నేత భూమా శోభానాగిరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి కుమారుడు ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు ఎమ్మెల్యేగా వైసీపీ టికెట్ పైనే గడచిన ఎన్నికల్లో విజయం సాధించారు. గతంలో భూమా కుటుంబంతో పాటు ఎస్వీ కుటుంబం కూడా టీడీపీలోనే కొనసాగాయి. ఎస్వీ సుబ్బారెడ్డి టీడీపీ ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగానూ పనిచేశారు. వయోభారంతో సుబ్బారెడ్డి క్రియాశీల రాజకీయాలకు దూరం కాగా, ఆయన కుమారుడు ఎస్వీ మోహన్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తొలుత ఎమ్మల్సీగా ఎన్నికైన ఆయన మొన్నటి ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థిగా నిలిచిన ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ పై విజయం సాధించారు. తాజాగా భూమా సొంత పార్టీ టీడీపీలోకి చేరిపోవడంతో ఎస్వీ మోహన్ రెడ్డి కూడా తన బావ భూమా బాటలోనే నడుస్తారని ప్రచారం సాగింది. అయితే కాస్తంత విరామం ఇచ్చిన ఎస్వీ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం పార్టీ మారుతున్నట్లు లీకులిచ్చారు. ఇప్పటికే తన మద్దతుదారులతో చర్చలు జరిపిన ఆయన టీడీపీలో చేరేందుకే నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎస్వీ కూడా టీడీపీలో చేరితే... జిల్లా రాజకీయాల్లో కీలక కుటుంబాలుగా పరిగణిస్తున్న భూమా, ఎస్వీ కుటుంబాలు తిరిగి తమ సొంత గూటికి చేరినట్లవుతుంది.

  • Loading...

More Telugu News