: గుంటూరు జిల్లాలో వెరైటీ కేసు!... సెక్షన్లతో కుస్తీలు పడుతున్న తాడేపల్లి ఖాకీలు!


గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు ఇటీవల వచ్చిన ఓ ఫిర్యాదు నిజంగా వెరైటీగా ఉంది. ఓ రిటైర్డ్ సైనికుడి నుంచి వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలో తెలియక ఆ స్టేషన్ లోని పోలీసులు తలలు పట్టుకున్నారు. మాజీ సైనికుడి నుంచి వచ్చిన సదరు ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా ఉండలేని పరిస్థితి. ఏ సెక్షన్ల కింద కేసు పెట్టాలో తెలియని పరిస్థితి. ఏం చేయాలో పాలుపోక స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో పాటు ఆ స్టేషన్ రైటర్ కూడా అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అసలు విషయమేమిటంటే... గతంలో భారత సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన ఓ వ్యక్తి తాడేపల్లిలోని ఆర్ఎంఎస్ కాలనీలో నివాసముంటున్నారు. ఆయనకు కొడుకుతో పాటు ఓ కూతురు కూడా ఉంది. కొడుకు, కూతుళ్లకు పెళ్లిళ్లు చేసేసిన సదరు వ్యక్తి... కూతురును అత్తారింటికి పంపారు. కొడుకు మాత్రం ఆయన వద్దే ఉండిపోయాడు. తదనంతరం కూతురు కుమార్తె (మనవరాలు)కు కూడా పెళ్లి అయ్యింది. మనవరాలు కూడా అత్తారింటికి వెళ్లిపోయింది. ఏమైందో తెలియదు కాని... ఇటీవల ఆ మాజీ సైనికుడి మనవరాలు తన భర్తతో కలిసి తాత ఇంటికి వచ్చేసింది. రోజులు గడుస్తున్నాయి. వృద్దుడైన ఆ మాజీ సైనికుడి సతీమణికి 10 మందికి పైగా బంధువులకు వండి వార్చే శక్తి లేకపోయింది. వచ్చి చాలా రోజులైంది కదా... ఇక మీ ఇంటికి వెళ్లండంటూ ఆ మాజీ సైనికుడు మనవరాలికి సౌమ్యంగానే చెప్పారు. ఈ మాటతో అంతెత్తున ఎగిరిపడ్డ ఆ మనవరాలు... తాత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొడుకు కొడుకు(మనవడు)తో సమానంగా కూతురు కుమార్తె(మనవరాలి) హోదాలో తనకూ ఆస్తిలో హక్కుందని కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. దీంతో షాక్ తిన్న ఆ మాజీ సైనికుడు... చేసేది లేక పోలీసులను ఆశ్రయించారు. భర్తతో కలిసి తన ఇంటిలో తిష్ట వేసిన మనవరాలు ఎంతకీ ఇల్లు వదిలి వెళ్లడం లేదని, కొత్తగా తనకూ ఆస్తిలో హక్కుందని బెదిరిస్తోందని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును అందుకున్న పోలీసులు అయోమయంలో పడ్డారు. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలో పాలుపోక వారు అయోమయ స్థితిని ఎదుర్కొంటున్నారు. మరి ఈ కేసును వారు ఏ రకంగా పరిష్కరిస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News