: సానియా మీర్జా ఆటోబయోగ్రఫీ వస్తోంది!


ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా రాకెట్ వదిలి పెన్ను పట్టుకుంది. అయితే, జర్నలిస్టో, కవో, రచయిత్రో అయిపోయిందనుకుంటున్నారా, అదేంకాదులెండి. తన జీవిత విశేషాలను తన అభిమానుల ముందు ఉంచేందుకు, విజయరహస్యాలను అందించేందుకు మాత్రమే ఆమె రచయిత్రి అవతారమెత్తింది. సానియా రాస్తున్న ఈ ఆటో బయోగ్రఫీ ‘ఏస్ ఎగనెస్ట్ ఆడ్స్’ను జూలైలో విడుదల చేయనున్నారు. ఈవిషయాన్ని ప్రపంచ ప్రఖ్యాత పబ్లిషర్స్ హార్పర్ కొలిన్స్ వెల్లడించింది. ఈ సందర్భంగా హార్పర్ కొలిన్స్ ఇండియా విభాగానికి చెందిన చీఫ్ ఎడిటర్ కార్తిక మాట్లాడుతూ, సానియా మిర్జా ఆటోబయోగ్రఫీని పబ్లిష్ చేసే అవకాశం తమకు లభించడంపై సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఒక ప్రముఖ క్రీడాకారిణి జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావడం తమకు గర్వకారణంగా కూడా ఉందన్నారు. కాగా, సానియా ఆత్మకథ రాసేందుకు తండ్రి ఇమ్రాన్ మిర్జా ఆమెకు సహకరించారు. టెన్నిస్ లో ఓనమాలు, జయాపజయాలు, వాటిని అధిగమించిన తీరు, విజయ రహస్యాలను ఈ పుస్తకం ద్వారా సానియా వెల్లడించనుంది. ఈ పుస్తకం ఆధారంగా సానియా జీవితంపై ఒక సినిమా తీసే ఆలోచనలో బాలీవుడ్ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News