: హైదరాబాదులో మరో స్ట్రీట్ ఫైట్!... ఓ వ్యక్తిపై 8 మంది సభ్యుల ముఠా మూకుమ్మడి దాడి


భాగ్యనగరి హైదరాబాదు స్ట్రీట్ ఫైట్లకు అడ్డాగా మారుతోంది. పాతబస్తీలో ఇటీవల కలకలం రేపిన ఓ స్ట్రీట్ ఫైట్ లో ఓ మైనర్ బాలుడు నడిరోడ్డుపైనే ప్రాణాలు వదిలాడు. తాజాగా నగర శివారు ప్రాంతంలో గత శుక్రవారం జరిగినట్లుగా భావిస్తున్న మరో స్ట్రీట్ ఫైట్ కలకలం రేపుతోంది. ఓ వ్యక్తిని వెంబడించిన 8 మంది వ్యక్తులు అక్కడి ఓ పెట్రోల్ పంపు సమీపంలో బాధితుడిపై మూకుమ్మడి దాడి చేశారు. సదరు వ్యక్తిని మట్టుబెట్టేందుకు ఆ 8 మంది సభ్యుల ముఠా యత్నించింది. అయితే ఆ ముఠాతో ఎదురొడ్డి పోరాడిన బాధితుడు తీవ్ర గాయాల పాలై, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ స్ట్రీట్ ఫైట్ మొత్తం పెట్రోల్ పంపులోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ ఫుటేజీని సంపాదించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తనపై దాడికి దిగిన ముఠాపై ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు స్పందించిన పాపాన పోలేదని అతడు వాపోతున్నాడు. ఈ స్ట్రీట్ ఫైట్ కు చెందిన ఫుటేజీలు తాజాగా మీడియా చేతికి చిక్కాయి. ఈ దృశ్యాలు నగరంలో పెరుగుతున్న నేర ప్రవృత్తికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అందరూ చూస్తుండగానే ఆ ముఠా బాధితుడిపై జరిపిన దాడి నగర జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది.

  • Loading...

More Telugu News