: అమెరికా అధ్యక్ష బరిలో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంపే!... వచ్చే నెల 7న నామినేషన్!
అగ్రరాజ్యం అమెరికాకు త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ఆ దేశ రియల్ ఎస్టేట్ టైకూన్ డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం ఖరారైపోయింది. ఇడియానాపోలిస్ కు జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్... టెడ్ క్రూజ్ ను మట్టి కరిపించేశారు. ఇప్పటికే మెజారిటీ ప్రైమరీలను గెలుచుకున్న ట్రంప్... ఇండియానాపోలిస్ లోనూ జయకేతనం ఎగురవేయడంతో రిపబ్లికన్ల తరఫున ఆయన అభ్యర్థిత్వం ఖరారైపోయింది. ఈ ఏడాది నవంబర్ 8న జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ట్రంప్ వచ్చే నెల 7న తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇదిలా ఉంటే... డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు శతథా యత్నిస్తున్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్ కు ఇండియానాపోలిస్ ప్రైమరీలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష బరిలోకి దిగే క్రమంలో ఇప్పటికే తన సమీప ప్రత్యర్థుల కంటే మెజారిటీ సాధించిన హిల్లరీ... ఇండియానాపోలిస్ లో మాత్రం సత్తా చాటలేకపోయారు. హిల్లరీపై ఆమె పార్టీకి చెందిన బెర్నీ శాండర్స్ విజయం సాధించారు.