: పెద్దల సభ నుంచి మాల్యా బహిష్కరణ?... నేడు రాజ్యసభలో ఎథిక్స్ కమిటీ తీర్మానం
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు పెద్దల సభ రాజ్యసభలో నేడు పెద్ద ఎదురు దెబ్బ తప్పేలా లేదు. మాల్యాను సభ నుంచి బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. బ్యాంకులకు కోట్లాది రూపాయల రుణాలను ఎగవేసిన మాల్యా లండన్ చెక్కేసిన సంగతి తెలిసిందే. అయితే మాల్యాను భారత్ కు తిరిగి రప్పించే క్రమంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు విశ్వ యత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆయన పాస్ పోర్టు రద్దు కాగా... తాజాగా ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ విషయం తెలుసుకున్న మాల్యా... రాజ్యసభ తనను బహిష్కరించకముందే, తానే రాజీనామా చేయాలని యోచించారు. ఈ మేరకు ఆయన మొన్న రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా లేఖ రాశారు. అయితే మాల్యా సంతకం కూడా లేని సదరు లేఖను చైర్మన్ హోదాలోని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తిరస్కరించారు. ఈ క్రమంలో మాల్యా బహిష్కరణకే మొగ్గుచూపిన ఎథిక్స్ కమిటీ నేడు రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ తీర్మానానికి ఏకగ్రీవంగానే ఆమోదం లభించనుంది. ఆ వెంటనే మాల్యా రాజ్యసభ నుంచి బహిష్కరణకు గురి కానున్నారు.