: 'స్వాతిముత్యం'లోని కమలహాసన్ ని గుర్తుకు తెచ్చింది.. జైలు పాలైంది!
ఆమెకు 'స్వాతిముత్యం' సినిమాలో కమలహాసన్ తెలుసో లేదో కానీ అతనిలా చేసి జైలు పాలైంది. స్వాతిముత్యం సినిమాలో రాధికను వివాహమాడిన కమలహాసన్ కు ఉద్యోగం చూస్తానని జేవీ సోమయాజులు మాటిస్తారు. అంతే! ఆ క్షణం నుంచి కమలహాసన్ ఆయన వెంటపడతాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షమవుతాడు. కమల్ తీరుతో విసిగిపోయిన సోమయాజులు ఆఖరుకి ఆయనకు గుడిలో వాచ్ మన్ ఉద్యోగం ఇప్పిస్తారు. ఇక మన కథలోకి వస్తే, అమెరికాలోని మిల్ ఫోర్డ్ ప్రాంతంలో బుర్ ఫెర్ అనే మహిళ ఉద్యోగం కోసం ఓ సంస్థ యజమానికి రోజుకు 300 సార్లు ఫోన్ చేసేదట. ఇలా మూడు రోజుల పాటు వందలాది ఫోన్లు చేసి అతనికి చుక్కలు చూపించింది. ఆమె వేధింపులు తట్టుకోలేకపోయిన ఆయన పోలీసులను ఆశ్రయించాడు. దీంతో బుర్ ఫెర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగం కోసం ఇలా ఎవరైనా చేస్తారా? అని వారు అవాక్కయ్యారు.