: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ‘చంద్రన్న’ పేరు... విమర్శలు!
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరుమీదే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి పేరిట కూడా ఇన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్న దాఖలాలు లేవంటున్నారు. సుమారు 12 ప్రభుత్వ పథకాలకు ‘చంద్రన్న’ అనే పదం ఉందన్నారు. తాజాగా, ఏపీలో రెండు రోజుల క్రితం ప్రారంభించిన ఇన్సూరెన్స్ స్కీమ్ ‘చంద్రన్న బీమా’. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తర్వాత ప్రభుత్వ పథకాలకు తన పేరు తగిలించుకున్న సీఎం చంద్రబాబే అని విశ్లేషకులు అంటున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, ఎన్టీఆర్ భరోసా సంక్షేమ పథకాలలో మాత్రమే ఎన్టీఆర్ పేరు కనపడుతుంది. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు లో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ‘అమ్మ’ అనే పదం కామన్ గా కన్పిస్తుంది. ఇదే పద్ధతిని చంద్రబాబు అనుసరిస్తున్నారని అంటున్నవారూ లేకపోలేదు. ఏపీలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ‘చంద్రన్న’కు బదులు ‘అన్న’ పదాన్ని చేర్చకపోవడానికి ఒక కారణం ఉందని రాజకీయాలను నిశితంగా పరిశీలించే వారు అంటున్నారు. ‘అన్న’ అంటే కేవలం ఎన్టీఆరే నని, ఆ పిలుపు ఆయనకే చెల్లిందంటున్నారు. ఇంతకీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ‘చంద్రన్న’ అనే పదం ఎప్పటి నుంచి వచ్చి చేరిందంటే... ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ అనే పథకం నుంచి! ఆ తర్వాత ‘చంద్రన్న క్రిస్మస్ కానుక’, రైతు పథకాలకు సంబంధించి ‘చంద్రన్న వ్యవసాయ క్షేత్రం’, దళితులకు సంబంధించి ‘చంద్రన్న దళిత బాట’, గిరిజనులకు సంబంధించి ‘చంద్రన్న గిరిజన బాట’, ఎస్సీ, ఎస్టీలకు రుణాలకు సంబంధించి ‘చంద్రన్న రుణ మేళా’, నిరుద్యోగుల కోసం ‘చంద్రన్న ఉద్యోగ మేళా’, సెల్ఫ్ హెల్ఫ్ మహిళా సంఘాల కోసం ‘చంద్రన్న చేయూత’, గ్రామాల్లో సిమెంట్ రోడ్ల ప్రాజెక్ట్ కు ‘వాడవాడలా చంద్రన్న బాట’, మొబైల్ హెల్త్ కు సంబంధించి ‘చంద్రన్న సంచార చికిత్స’ వంటి పథకాలలో ‘చంద్రన్న’ పేరు ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.