: ఇదో వింత... గాడిదల పండగ!
దేని గురించి అయినా అవగాహన కల్పించేందుకు పలు రకాల పద్ధతులను అవలంబిస్తుంటాం. మొక్కలు, నీరు, విద్య, మానవ సంబంధాలు... ఇలా పలు విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇదే కోవలోకి వచ్చే ఒక అవగాహన కార్యక్రమం మెక్సికోలోని ఒక చిన్న ప్రాంతమైన 'ఒటుంబ'లో జరిగింది. జంతువుల గురించి ఆ ప్రాంతంలో వారికి అవగాహన కల్పించేందుకు గాను ప్రతి ఏటా ఒక కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా గాడిదల గురించి ఈ వార్షిక పండగలో ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. ఈ సందర్భంగా గాడిదల రేసు నిర్వహిస్తుంటారు. యజమానులు తమ గాడిదలను సుందరంగా అలంకరించి వింత వేషధారణలతో ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. అందరినీ ఆకట్టుకున్న గాడిదకు ఉత్తమ బహుమతి ఇస్తుండటం పరిపాటి. ఈ పండగలో సుమారు నలభై వేల మంది వరకు పాల్గొంటూ ఉంటారు. సందర్శకులను అలరించేందుకుగాను కొంత మంది ఔత్సాహికులు గాడిదల వేషాధారణల్లో దర్శనమిస్తుంటారు. ఈ ఏడు జరిగిన పోటీల్లో విచిత్రమేమిటంటే, అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ వేషధారణలో ఒక గాడిదను అలంకరించారు!