: కలకలం రేపుతోన్న మహిళా జర్నలిస్టు మృతి... హత్యా? ఆత్మహత్యా?
హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఓ మహిళా జర్నలిస్టు మృతి చెందిన ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది. మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన పూజ తివారి ఫరీదాబాద్‌లో ఓ మీడియా పోర్టల్‌లో జర్నలిస్టుగా పనిచేస్తోంది. అక్కడే ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటోంది. అయితే ఓ కేసులో నిందితురాలయిన ఆమె.. రెండు రోజుల క్రితం తన తోటి జర్నలిస్టు అమ్రీన్ అనే వ్యక్తితో పాటు, పోలీసు అధికారి అమిత్‌కుమార్‌తో కలసి తన అపార్ట్‌మెంట్‌లో మద్యం సేవించింది. అయితే ఉన్నట్టుండి ఐదో అంతస్తులో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో నుంచి కిందకి దూకి మరణించింది. క్షణికావేశంలో పూజ ఆత్మహత్య చేసుకుందని అమ్రీన్, అమిత్‌కుమార్ చెప్పారు. అయితే ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూజ మృతదేహాన్ని పోస్టు మార్టం చేసిన అనంతరం నిజా నిజాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. పూజా పనిచేస్తున్న సంస్థ ఆమెకు వేతనాలివ్వడం లేదని ఆ దిశగా కూడా దర్యాప్తు జరుపుతామని పోలీసులు అంటున్నారు. మరోవైపు గతంలో పూజా చీటింగ్, బెదిరింపులకు పాల్పడిందని ఈ కేసులో పూజ నిందితురాలని పోలీసులు తెలిపారు.