: అరికెలా?... శోభారాణా?: సాయన్న స్థానం భర్తీపై చంద్రబాబు మల్లగుల్లాలు
గడచిన ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై కంటోన్మెంట్ స్థానం నుంచి బరిలోకి దిగిన సాయన్న ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు ఆయన లొంగిపోయారు. సైకిల్ దిగేసి కారెక్కేశారు. ఈ క్రమంలో నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చదలవాడ కృష్ణమూర్తి సహా 19 సభ్యుల్లో ఒక్క సాయన్న మినహా మిగిలిన వారందరినీ బోర్డులో కొనసాగించనున్నట్లు ఆ ఉత్తర్వులు స్పష్టంగా పేర్కొన్నాయి. ఇక టీడీపీకి ఝలక్కిచ్చిన సాయన్నను మాత్రం బోర్డులో కొనసాగించేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిరాకరించారు. దీంతో పదవీ కాలం పొడిగింపు సాయన్నకు దక్కలేదు. టీటీడీ బోర్డు నుంచి ఆయన పేరు గల్లంతైంది. ఇక సాయన్న స్థానంలో ఎవరిని నియమించాలన్న అంశంపై విజయవాడలో జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చ జరిగింది. పార్టీ తెలంగాణ శాఖకు చెందిన మహిళా నేత శోభారాణికి ఆ పదవి ఇవ్వాలని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ సూచించారు. అయితే పార్టీ అభివృద్ధి కోసం అలుపెరగని పోరు సాగిస్తున్న అరికెల నర్సారెడ్డి లాంటి వారికి న్యాయం చేయాల్సి ఉందన్న చంద్రబాబు... దీనిపై తర్వాత ఆలోచిద్దామని అప్పటికి దానిపై చర్చకు ముగింపు పలికారు. సాయన్న బహిష్కరణతో ఖాళీ అయిన టీటీడీ బోర్డు సభ్యుడి పదవి మాత్రం శోభారాణి, అరికెల నర్సారెడ్డిల్లో ఒకరికి దక్కడం మాత్రం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.