: పొంగులేటి బ్రదర్స్ ఫైట్!... శ్రీనివాసరెడ్డిపై సుధాకర్ రెడ్డి ఫైర్!

ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి బ్రదర్స్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ ఆవిర్భావానికి ముందు దాకా పొంగులేటి బ్రదర్స్... సుధాకర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డిల మధ్య పెద్ద వివాదాలేమీ లేవు. దాదాపుగా కలిసే సాగారు. వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిపోయారు. పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అంతకుముందే ఆయన సోదరుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మంచి పేరు సాధించారు. ప్రస్తుతం సుధాకర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండగా, శ్రీనివాసరెడ్డి ఖమ్మం ఎంపీగా ఉన్నారు. నిన్న వైసీపీకి గుడ్ బై కొట్టేసిన శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో తన సోదరుడు శ్రీనివాసరెడ్డిపై సుధాకర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాదు వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ముసుగు వేసుకుని ఇంతకాలం వైసీపీలో కొనసాగిన శ్రీనివాసరెడ్డి నిజ స్వరూపం ఎట్టకేలకు బట్టబయలైందని ఆయన ఆరోపించారు. అసలు ప్రత్యేక తెలంగాణ కోసం శ్రీనివాసరెడ్డి ఏం చేశారని ఆయనను పార్టీలో చేర్చుకుంటున్నారని కూడా టీఆర్ఎస్ నేతలను సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఉద్యమం చేశారా? జైలుకెళ్లారా? అంటూ ఆయన శ్రీనివాసరెడ్డిపై ధ్వజమెత్తారు. సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చే శ్రీనివాసరెడ్డిని చేర్చుకోవడం టీఆర్ఎస్ కు నష్టమేనని ఆయన ఆరోపించారు.