: నాగార్జున సాగర్లో నీరు లేదని ఇప్పుడు తెలిసిందా?: జగన్ కు దేవినేని ఉమా సూటిప్రశ్న
ఆంధ్రప్రదేశ్లో కరవు పరిస్థితి, అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న సాగునీటి ప్రాజెక్టులపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్రస్థాయిలో స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న దేవినేని.. ప్రభుత్వంపై జగన్ చేస్తోన్న విమర్శలను తిప్పికొట్టారు. ‘జగన్కు నాగార్జున సాగర్లో నీరు లేదని ఇప్పుడు తెలిసిందా?’ అని ప్రశ్నించారు. సాగునీటి పారుదల మళ్లింపు అంశంపై జగన్ ఉన్నట్టుండి ఇప్పుడు మాట్లాడడం ఏంటని దేవినేని ఉమా దుయ్యబట్టారు. జగన్ సాగునీరు మళ్లింపుపై తమపై విమర్శలు చేయడం దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు. సమస్యలపై గళం విప్పుతున్నామంటూ చేస్తోన్న ప్రగల్భాలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టాలని జగన్ కు సూచించారు.