: 'అపురూప లావణ్యవతి'... అగస్టా డీల్ లో ఎస్పీ త్యాగికి ఇటలీ పెట్టుకున్న ముద్దుపేరు!
అగస్టా చాపర్ల కుంభకోణంలో ఆరోపణలు రాగా, ప్రస్తుతం సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న భారత వైమానిక దళ మాజీ అధిపతి ఎస్పీ త్యాగిని, ఇటలీ మధ్యవర్తులు కోడ్ నేమ్ తో సంబోధించే వారట. ఈ కేసులో మధ్యవర్తులుగా, డీల్ కోసం సంప్రదింపులు చేసిన గుయిడో రాల్ఫ్ హష్కే, కార్లో జెరోసాలు తమ సంభాషణల్లో త్యాగిని 'అపురూప లావణ్యవతి' (ఇటలీ భాషలో గియులి లేదా గియులియా)గా సంబోధించేవారట. మార్చి 25, 2012లో వీరిద్దరినీ మిలాన్ లోని మల్పెన్సా ఎయిర్ పోర్టులో త్యాగి కలుసుకున్నాడని సీబీఐ, ఈడీ అధికారులు సేకరించిన పత్రాల్లో ఉంది. "... 25,03, 2012న హస్కే, జెరోసాలు గియులియాను మిలాన్/మల్పెన్సా ఎయిర్ పోర్టులో కలుసుకున్నారు. ఆపై తిరిగి వెళుతూ, చాపర్ డీల్ లో ఇటలీ విచారణ పట్ల గియులియా ఆందోళన వ్యక్తం చేశారు" అని ఆ పత్రాల్లో ఉన్నట్టు సమాచారం. కాగా, రూ. 3,600 కోట్ల చాపర్ డీల్ లో లంచాల బాగోతంపై 2011లో ఇటలీ ప్రభుత్వం విచారణ ప్రారంభించగా, అప్పటి నుంచి పాలక, విపక్ష నేతలు ఒకరిని ఒకరు విమర్శించుకునేందుకు అస్త్రంగా మారింది.