: తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్!... తెలంగాణ ప్రాజెక్టులపై సుప్రీంకు ఏపీ?
మొన్నటిదాకా మహారాష్ట్ర, కర్ణాటకలతో ఉమ్మడి ఏపీ జల పోరాటం సాగించింది. తాజాగా రాష్ట్ర విభజనతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్యే వాటర్ వార్ కు దాదాపుగా తెర లేచిందనే చెబుతున్నారు విశ్లేషకులు. కొత్త రాష్ట్రంలో పాలమూరు-రంగారెడ్డి, డిండి పేరిట కొత్త ప్రాజెక్టులు, కల్వకుర్తి ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే గోదావరి, కృష్ణా నదులపై మహారాష్ట్ర, కర్ణాటకలు లెక్కలేనన్ని ప్రాజెక్టులను కట్టి కిందకు నీటినే వదలడం లేదు. తాజాగా తెలంగాణ కూడా ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులను కడితే తమ పరిస్థితి ఏమిటని ఏపీ వాదిస్తోంది. ఈ మేరకు ఇటీవల ప్రాజెక్టులను కట్టొద్దంటూ ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు, వాటికి కౌంటరిస్తూ తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల మధ్య వేడిని రాజేశాయి. ఈ క్రమంలో నిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమిపూజ సందర్భంగా తమకు కేటాయించిన మేర నీటిని వాడుకుని తీరతామని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపేదే లేదని ఆయన తేల్చిచెప్పారు. అదే సమయంలో నిన్న విజయవాడలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో తెలంగాణ ప్రాజెక్టుల అంశంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణకు ముకుతాడు వేయకుంటే తమకు తీరని అన్యాయం జరిగి తీరుతుందని ఆయన కేబినెట్ మంత్రులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ వైఖరిపై తక్షణమే కేంద్రానికి లేఖ రాయడంతో పాటు కేంద్రం స్పందించని పక్షంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కేందుకూ వెనుకాడరాదని చంద్రబాబు నిర్ణయించారు. ఈ క్రమంలో రానున్న కాలంలో ఇరు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతోంది.