: మా నిర్లక్ష్యం లేదు.. పేషెంట్లకు సరిపడా సిబ్బంది మా దగ్గర లేరు: గర్భిణి మృతిపై కోఠీ మెటర్నిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్
హైదరాబాద్ కోఠిలోని మెటర్నిటీ ఆసుపత్రిలో వైద్యం అందక మమత అనే గర్భిణి మృతి చెందిన ఘటనపై ఆసుపత్రి అధికారులు స్పందించారు. మమత మృతికి వైద్యుల నిర్లక్ష్యం కారణం కాదని చెబుతున్నారు. పేషెంట్లకు సరిపడా సిబ్బంది తమ దగ్గర లేరని ఆసుపత్రి సూపరింటెండెంట్ రత్నకుమారి చెప్పారు. ఆసుపత్రి సిబ్బంది డబ్బుల కోసం పీడిస్తున్నారని పేషెంట్లు ఆరోపిస్తున్న నేపథ్యంలో సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని తమకు ఇంతవరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని రత్నకుమారి చెబుతున్నారు. మమత మృతికి ఆమె ఊపిరితిత్తులలో నీరు చేరడమే కారణమని చెప్పారు. ఆసుపత్రిలో సీనియర్ వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసుపత్రిలో కావలసినంత వైద్య సిబ్బంది లేరని రత్నకుమారి తెలిపారు. ఆసుపత్రిలో పేషెంట్ల తాకిడి ప్రతీరోజు ఎక్కువగా ఉంటుందని అన్నారు. కాగా, గర్భిణి మమత మృతిపై ఆమె బంధువులు, స్థానికులు ఆసుపత్రి ప్రాంగణంలో ఆందోళనను కొనసాగిస్తున్నారు. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులని మోహరింపజేశారు.