: మోదీ వచ్చాక ఇండియాలో మత ఘోరాలు, పెరిగిన అసహనం: బురద జల్లిన అమెరికా!
ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇండియాలో మత స్వాతంత్ర్యం ప్రమాదకరంగా మారిందని, కొన్ని మతాల వారు స్వేచ్ఛను ఉల్లంఘిస్తూ, ఇతర మతాలపై దాడులు జరుపుతున్నారని, ప్రజల్లో అసహనం పెరిగిందని యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం (యూఎస్సీఐఆర్ఎఫ్) తన వార్షిక నివేదికలో వెల్లడించింది. త్వరలో నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్న వేళ, ఆ దేశం ఈ తరహాలో ఆరోపణలు చేయడం గమనార్హం. ఉద్రిక్తత పెరిగేలా ఇతర మతాలపై వ్యాఖ్యలు చేస్తున్న పెద్దలను భారత ప్రభుత్వమే వెనకేసుకొస్తోందని ఆరోపించింది. అమెరికాతో భారత్ కు ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను ప్రభావితం చేసేంతగా, పరమత సహనం నశించినట్టు కనిపిస్తోందని వెల్లడించిన యూఎస్ సీఐఆర్ఎఫ్, అంతర్గత వ్యవస్థలపైనా ఆరోపణలు చేసింది. తదుపరి భారత్ తో జరిపే చర్చల్లో మతపరమైన అంశాన్నీ జోడించాలని సూచించింది. మైనారిటీలపై దాడులకు పాల్పడుతున్న వారిని నిలువరించడంలో పోలీసులు సైతం మిన్నకుంటున్నారని పేర్కొంది. ఇండియాలో పరిస్థితి మారేందుకు అమెరికా ప్రభుత్వం తనవంతు ప్రయత్నం చేయాలని కోరింది. యూఎన్ సీఐఆర్ఎఫ్ ఓ స్వతంత్ర సంస్థగా నివేదికను ఇచ్చినప్పటికీ, ఈ సంస్థకు నిధులను, ఉద్యోగులను ప్రభుత్వమే అందిస్తుంది.