: అమ్మ తిరిగి అధికారం పొందితే అది ఇడ్లీ, సాంబార్ చలవే!


తమిళనాడులో ప్రస్తుత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, తిరిగి అధికారంలోకి వస్తే, అది ఆమె ప్రారంభించిన అమ్మ క్యాంటీన్ల చలవేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిత్యమూ అమ్మ క్యాంటీన్లలో రూ. 3 చెల్లించి సాంబార్ రైస్, రూ. 1 చెల్లించి ఇడ్లీలు తింటున్న రిక్షా కార్మికుల నుంచి ఐటీ ఉద్యోగుల వరకూ ఓటింగ్ ను ఆమెకు అనుకూలంగా చేయనున్నారని భావిస్తున్నారు. నిత్యమూ వేలాది మంది అమ్మ క్యాంటీన్లలోని భోజనంతో కడుపు నింపుకుంటున్నారని, వీరంతా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం సాంబార్, ఇడ్లీలు మాత్రమే కాకుండా, రూ. 5కే పాలక్ రైస్, కర్డ్ రైస్ వంటి పదార్థాలను ప్లేటు నిండా అందిస్తున్న క్యాంటీన్లకు కొత్తగా వెళ్లేవారు, ధరల సూచికను చూసి, తాము 1980నాటి కాలానికి వెళ్లినట్టుందని వ్యాఖ్యానిస్తున్నారంటే, అమ్మ క్యాంటీన్లు ఎంత మార్పును తెచ్చాయో అర్థం చేసుకోవచ్చు. ఈ క్యాంటీన్లను ప్రారంభించిన సమయంలో ఇవి ఎంతకాలం నడుస్తాయన్న అనుమానాలు వచ్చినప్పటికీ, వాటిని పటాపంచలు చేయడంలో జయలలిత విజయం సాధించారు. తమిళనాడులోని అన్ని ప్రధాన పట్టణాల్లో ఈ క్యాంటీన్లు దాదాపు 200 వరకూ నిత్యమూ సేవలందిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు సైతం తమ పరిశీలకులను పంపి, ఈ క్యాంటీన్లు నడుపుతున్న విధానాన్ని సమీక్షిస్తున్నాయంటే ఇవి చూపిన ప్రభావం తెలుస్తుంది. ఇక ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే, ఇదే తరహా క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తామని జయలలిత ఇప్పటికే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 'అమ్మ' అందిస్తున్న చౌక అహారం తినేవారు తమ అన్నదాతను ఓటేసి ఆశీర్వదిస్తారా? లేదా? అన్నది మరో 16 రోజుల్లో తేలుతుంది.

  • Loading...

More Telugu News