: ఏదైనా సరే ప్రారంభం నుంచి మొదలు పెట్టాల్సిందేనన్న ఆలోచనతోనే ఈ టైటిల్ పెట్టాను!: త్రివిక్రమ్
మనం పని చేసేటప్పుడో లేక గెలవడంలోనో, లేక ప్రయాణంలోనో ఎక్కడైనా, ఏదైనా సరే ప్రారంభం నుంచి మొదలు పెట్టాల్సిందేనన్న ఆలోచనతో ఈ టైటిల్ పెట్టానని త్రివిక్రమ్ తెలిపాడు. 'అ...ఆ' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, కుటుంబంతో గడిపిన, స్నేహితులతో గడిపిన రోజులు వెనక్కి చూసుకుంటే తీయగా ఉంటాయి. వాటిని వెనక్కి తిరిగి చూడాలని ఎలా ఉత్సాహం చూపుతామో...దీనిని కూడా అలాగే తీశానని ఆయన అన్నారు. ఈ సినిమా తెరకెక్కించేందుకు తన వెనుక నిలబడింది నిర్మాత చినబాబు అని ఆయన చెప్పారు. కథ ఉన్న సినిమా అని నమ్మి చేసినందుకు నితిన్ కు ధన్యవాదాలు చెప్పారు. ఎన్నిరోజులు అడిగితే అన్ని రోజులు డేట్స్ కేటాయించిన సమంతకు ధన్యవాదాలు చెప్పారు. ఈ సినిమా కోసం చదివిన చదువు చదివితే నదియా కలెక్టర్ లేదా, డాక్టర్ అయి ఉండేవారని త్రివిక్రమ్ నవ్వుతూ అన్నారు. అనుపమ పరమేశ్వరన్ ను చాలా కాలం చూస్తారని త్రివిక్రమ్ తెలిపారు. ఆమె మంచి నటి అని అన్నారు. అలాగే తనకు ఎంతో ఇష్టమైన సూర్యాకాంతంగారిలా తేజ నటించిందని, ఆమెను కూడా చాలా కాలం పాటు ప్రేక్షకులు చూస్తారని త్రివిక్రమ్ అన్నారు.