: బ్రిటన్ టాటా స్టీల్ కోసం కదిలిన ఎన్నారై సంజీవ్ గుప్తా


పెను నష్టాల్లో కూరుకుపోయి, వేలాది మంది కార్మికులను రోడ్డున పడేసి లాకౌట్ అయిన బ్రిటన్ లోని టాటా స్టీల్ సంస్థ వ్యాపారాన్ని చేజిక్కించుకునేందుకు లిబర్టీ హౌస్ అధినేత, ప్రవాస భారతీయుడు సంజీవ్ గుప్తా కదిలారు. గతంలో ఎన్నో మూతపడ్డ ఉక్కు కర్మాగారాలను కొని వాటిని తిరిగి నిలబెట్టిన చరిత్ర ఉన్న సంజీవ్ గుప్తా, రేపటి లోగా టాటా స్టీల్ కు ధరను నిర్ణయించి బిడ్ ను దాఖలు చేస్తారని సమాచారం. ఎంత మొత్తానికి సంస్థను చేజిక్కించుకోవచ్చన్న విషయమై తమ అధికారులు పరిశీలిస్తున్నారని లిబర్టీ హౌస్ ప్రతినిధి వెల్లడించారు. టాటా స్టీల్ కు మంగళవారం నాడు బిడ్ ను దాఖలు చేయనున్నామని, తాము విజయం సాధిస్తే, బిలియన్ పౌండ్లు వెచ్చించి సంస్థను తిరిగి నిలపాలన్నది గుప్తా అభిమతమని ఆ అధికారి తెలిపారు. కాగా, ఈ సంస్థను కొనుగోలు చేస్తే, భవిష్యత్తులో లాభపడవచ్చని గత సంవత్సరం వరకూ టాటా స్టీల్ లో యూరప్ హెడ్ గా పనిచేసిన జాన్ బోల్టన్ నుంచి ఎందరో గుప్తాకు సలహాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. గత నెలలో లిబర్టీ హౌస్ లో చేరిన బోల్టన్ ప్రోద్బలం, ఆయన నివేదికల కారణంగానే సంజీవ్ గుప్తా టాటా స్టీల్ టేకోవర్ కు కదిలినట్టు సమాచారం. సంస్థను కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు వచ్చినా, కార్మికుల సంక్షేమం కోసం 25 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సిద్ధమని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News