: లాలూ పాదాలు తాకిన కన్నయ్య!... ట్విట్టర్ లో ఫొటోలు వైరల్!
ట్విట్టర్ లో పోస్ట్ అయిన ఓ ఫొటో వైరల్ గా మారిపోయింది. సదరు పోస్ట్ ను చూసిన నెటిజన్లు దానిపై కామెంట్లు సంధించకుండా ఉండలేకపోతున్నారు. అసలు ఆ ఫొటోలో ఏముందనేగా? ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రై విశ్వవిద్యాలయంలో ఉగ్రవాద అనుకూల ర్యాలీ, కామెంట్లు చేసిన వర్సిటీ విద్యార్ధి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్ గుర్తున్నారుగా. బీహార్ కు చెందిన ఆయన జేఎన్ యూ ఘటన తర్వాత ఇటీవలే తన సొంత రాష్ట్రం వెళ్లారు. సొంతూరుకు వెళుతున్న క్రమంలో కన్నయ్య పాట్నాలో కొద్దిసేపు ఆగారు. అక్కడ రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ను కలిశారు. ఈ సందర్భంగా లాలూ పక్కన నిలబడి ఉన్న కన్నయ్య ఒక్కసారిగా కిందకు వంగారు. లాలూ పాదాలను తాకి ఆయనకు వందనం చేశారు. ఈ ఫొటో ట్విట్టర్ లో చేరిన వెంటనే నెటిజన్లు ఘాటుగా స్పందించారు. అవినీతిపరుడైన లాలూ పాదాలను జేఎన్ యూ హీరోగా అభివర్ణించుకున్న కన్నయ్య ఎలా తాకుతాడంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. కొందరు సెటైరిక్ విమర్శలను గుప్పించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.