: జల యుద్ధానికి సన్నద్ధం... 16 ఏళ్ల నిరీక్షణ అనంతరం దూసుకెళ్లిన టైగర్ షార్క్


పదహారు సంవత్సరాల నిరీక్షణ అనంతరం భారత నావికా దళం శక్తిని మరింతగా ఇనుమడిస్తూ, నీటి అడుగున యుద్ధం చేయగల సత్తా ఉన్న ఐఎన్ఎస్ కల్వరి (టైగర్ షార్క్) ముంబై తీరం నుంచి జల ప్రవేశం చేసింది. అరేబియా సముద్రంలో పాక్ ఆగడాలను అడ్డుకునేందుకు ఈ సబ్ మెరైన్ ఎంతో ఉపకరిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిలో ప్రస్తుతానికి ప్రాథమిక ఆయుధాలు మాత్రమే చేర్చినప్పటికీ, హెవీ వెయిట్ టార్పెడోలు తదితర ఆయుధాలను డిసెంబర్ లోగా జోడిస్తామని నౌకాదళ అధికారులు వెల్లడించారు. కాగా, అగస్టా కుంభకోణంలో ఆరోపణలు వచ్చిన ఇటలీ సంస్థ ఫిన్ మెకానికా మరో సబ్ సైడరీ వైట్ హెడ్ అలెనియా సిస్టెమి సబాక్యువెల్ సంస్థ ఆరు స్కార్పేన్ సబ్ మెరైన్లను తయారు చేయగా, ఇవి ఎన్నో ఏళ్లుగా మజగాన్ లో జల ప్రవేశానికి ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. సబ్ మెరైన్ తయారీ ప్రాజెక్టులు కేటాయిస్తున్నప్పుడు అవకతవకలు జరిగాయని జర్మనీకి చెందిన అట్లాస్ ఎలక్ట్రానిక్ జీఎంబీహెచ్ ఫిర్యాదుతో తయారైన సబ్ మెరైన్ల తయారీకి ఆటంకాలు ఎదురయ్యాయి. ఇదిలావుండగా, మొత్తం రూ. 23,652 కోట్లతో స్కార్పేన్ ప్రాజెక్టు చేపట్టగా, వాస్తవానికి తొలి సబ్ మెరైన్ 2012లో, మిగిలిన ఐదూ 2017లో జల ప్రవేశం చేయాల్సి వుంది. తొలి సబ్ మెరైన్ ఇప్పటికి సిద్ధం కాగా, మిగతావి భవిష్యత్తులో దేశానికి సేవలందిస్తాయని అధికారులు వెల్లడించారు. ఇండియా వద్ద ప్రస్తుతం కేవలం 13 సబ్ మెరైన్లు మాత్రమే ఉండగా, ఇవన్నీ వయసు మళ్లినవే. సబ్ మెరైన్లు 25 ఏళ్ల పాటు సేవలను అందించేలా డిజైన్ చేయగా, మనకున్న పదమూడింటిలో 10 సబ్ మెరైన్లు 25 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నాయి. జూలై 1999లో వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 30 ఏళ్లలో 24 సబ్ మెరైన్లను దశలవారీగా సమకూర్చాలని నిర్ణయించగా, పదిహేడేళ్లు గడిచినా ఒక్కటి కూడా అందుబాటులోకి రాలేదు.

  • Loading...

More Telugu News