: మితివీురిన వేగం... ఇంజనీరింగ్ విద్యార్థిని దుర్మరణం!
కారు అదుపు తప్పి తమ ఇంటికి సమీపంలోనే ఉన్న చెట్టుకు ఢీకొన్న సంఘటనలో బీటెక్ విద్యార్థిని దుర్మరణం చెందిన సంఘటన నిన్న తెల్లవారుజామున హైదరాబాదులో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 70 డీకే నగర్ తులిప్ రెసిడెన్సీలో బిల్డర్ కట్కూరి నిరంజన్ రెడ్డి నివసిస్తున్నారు. ఆయన చిన్న కుమార్తె దేవి (21) నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమె స్నేహితుడు భరత్ సింహారెడ్డి యూసుఫ్ గూడలోని సెయింట్ మేరీస్ డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం రాత్రి నానక్ రాంగూడలోని ఒక హోటల్ ప్రారంభోత్సవానికి వీళ్లిద్దరూ కలిసి అతని కారులో వెళ్లారు. కార్యక్రమం అనంతరం ఇద్దరు మిత్రులను కూడా వారి కారులో ఎక్కించుకుని తిరిగి బయలుదేరారు. ఆ ఇద్దరి మిత్రులను వారు దిగాల్సిన స్థానాల్లో దించేశారు. ఆదివారం తెల్లవారు జామున జర్నలిస్టు కాలనీ మీదుగా డీకే నగర్ లోకి భరత్ కారు వెళుతుండగా ‘ఎక్కడున్నావు?’ అంటూ దేవి తండ్రి ఫోన్ చేశాడు. ‘సమీపంలోనే ఉన్నానని.. రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటాను’ అని దేవి తన తండ్రికి ఫోన్ లో చెప్పింది. ఈలోపే ఘోర ప్రమాదం జరిగిపోయింది. భరత్ చాలా స్పీడ్ గా కారు నడుపుతుండటంతో అదుపు తప్పిన కారు దేవి ఇంటికి సమీపంలోనే ఉన్న ఒక చెట్టుకు గుద్దుకుంది. ఎయిర్ బ్యాగ్ లుండటంతో భరత్ బతికి బయటపడ్డాడు. దేవి తలకు తీవ్రగాయాలవడంతో వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దేవి ప్రాణాలు విడిచిందని జూబ్లీ హిల్స్ పోలీసులు చెప్పారు. వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపిన భరత్ సింహారెడ్డిని అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేశామని, ఛాతీ నొప్పితో బాధపడుతున్న భరత్ ను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.