: మారని ఉబెర్... కొరడా తీస్తానన్న కేజ్రీవాల్!


యాప్ ఆధారిత క్యాబ్ సేవలను అందిస్తున్న ఉబెర్ ఢిల్లీలో తిరిగి రవాణా చార్జీలను అమాంతం పెంచేయడంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మండిపడ్డారు. కొన్ని కంపెనీలు ధరలను 3 రెట్ల వరకూ పెంచుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని ట్వీట్ చేశారు. ఈ ధరల పెంపు పధ్ధతిని 'డేలైట్ రాబరీ' (పట్టపగలు నిలువుదోపిడీ)గా ఆయన అభివర్ణించారు. గత నెలలో సరి-బేసి విధానం అమలు చేస్తున్నప్పుడు క్యాబ్ సేవలకు డిమాండ్ రాగా, అప్పుడు కూడా ఓలా, ఉబెర్ వంటి సంస్థలు చార్జీలను పెంచాయి. ఆపై ప్రభుత్వం చర్యలకు దిగడంతో ఆయా కంపెనీలు వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే. తిరిగి ఈ నెల 1 నుంచి సీఎన్జీ క్యాబ్ వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తూ, డీజిల్, పెట్రోల్ ట్రాన్స్ పోర్ట్ కార్లను నిషేధించిన వేళ, మరోసారి ప్రజల సొమ్మును దండుకునేందుకు క్యాబ్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, 'సర్జ్ ప్రైసింగ్' విధానం అమలు తాత్కాలికం మాత్రమేనని ఉబెర్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఓలా సంస్థ సైతం ధరలను పెంచుతూ, తన యాప్ లో 'పీక్ టైం చార్జెస్ అప్లికబుల్ ఆన్ హై డిమాండ్' అన్న మెసేజ్ ఉంచింది.

  • Loading...

More Telugu News