: సండ్రకు ఓకే... సాయన్నకు మాత్రం నో!: చంద్రబాబు సంచలన నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి కాల పరిమితిని మరో ఏడాది పొడిగిస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నేడు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. టీడీపీ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి చైర్మన్ గా 19తో కూడిన పాలక మండలి గతేడాది మే 2న పదవీ ప్రమాణం చేసింది. ఈ 19 మందిలో తెలంగాణకు చెందిన ఇద్దరు టీడీపీ నేతలకు కూడా నాడు చోటు దక్కింది. వారే ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సికింద్రాబాదు పరిధిలోని కంటోన్మెంటు ఎమ్మెల్యే సాయన్న. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా టీఆర్ఎస్ వలకు చిక్కిన సాయన్న పార్టీ మార్చేశారు. సైకిల్ దిగేసి కారెక్కేశారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న సాయన్న పార్టీ మారడం చంద్రబాబును షాక్ కు గురి చేసింది. నాడు తనకు తగిలిన షాక్ కు ప్రతీకారంగా చంద్రబాబు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ బోర్డులో చైర్మన్ చదలవాడతో పాటు మిగిలిన సభ్యులందరి పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించేందుకు ఆయన ఇప్పటికే సరేనన్నారు. అయితే సాయన్న పదవీ కాలాన్ని పొడిగించేందుకు మాత్రం ఆయన ససేమిరా అన్నారు. ఈ క్రమంలో టీ టీడీపీలోనే కొనసాగుతున్న సండ్ర వెంకటవీరయ్యను బోర్డులో కొనసాగించేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే సాయన్నను బోర్డు నుంచి తొలగించి ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.