: తెలంగాణలో వైఎస్ జగన్ కు ‘గులాబీ’ షాక్!... టీఆర్ఎస్ లో విలీనం కానున్న తెలంగాణ వైసీపీ!
గోరుచుట్టుపై రోకలి పోటు అంటే ఇదేనేమో. ఇప్పటికే ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’కు విలవిల్లాడుతున్న వైసీపీకి... తెలంగాణలో ‘గులాబీ’ దండు పెద్ద షాకే ఇవ్వనుంది. ఏపీలో పార్టీ ఎమ్మెల్యేలు వరుస కట్టి టీడీపీలోకి చేరుతుండగా, తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ లో ఆ పార్టీ శాఖ ఏకంగా విలీనం కానుంది. ఈ మేరకు నేడు పలు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందనుకున్న వైసీపీకి... ఖమ్మం జిల్లాలో ఖమ్మం లోక్ సభతో పాటు మూడు అసెంబ్లీ స్థానాల్లో విజయం దక్కింది. తెలంగాణలో ఏ ఒక్క జిల్లాలో ఆ పార్టీ ఊసు కనిపించకపోయినా... ఖమ్మం జిల్లాలో మాత్రం ఓ ఎంపీ, మూడు ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. ఈ క్రమంలో గతంలో టీఆర్ఎస్ చేపట్టిన ఆకర్ష్ కు ఇప్పటికే అక్కడి ఇద్దరు ఎమ్మెల్యేలు గులాబీ కండువాలు కప్పేసుకున్నారు. ఇక పార్టీ ఎంపీగా సత్తా చాటిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి... తెలంగాణలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టారు. ఇక పినపాక ఎమ్మెల్యేగా గెలుపొందిన పాయం వెంకటేశ్వర్లు ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తాజాగా పొంగులేటి సహా పాయం టీఆర్ఎస్ లో చేరిపోతున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ యువనేత, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో నిన్ననే పొంగులేటి కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. పొంగులేటితో పాటు పాయం వెంకటేశ్వర్లు కూడా టీఆర్ఎస్ లో చేరే క్రమంలో జరిగిన ఈ చర్చలు దాదాపుగా ఫలించాయనే చర్చ జరుగుతోంది. ఈ చర్చల ఫలితంగా నేడు ఖమ్మంలోనే వైసీపీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని పొంగులేటి, పాయంలు నిర్ణయించారు. తమ మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలతో చర్చించిన తర్వాత నేడు వారిద్దరూ టీఆర్ఎస్ లో చేరికకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడం, మిగిలిన మరో ఎమ్మెల్యే, సింగిల్ ఎంపీ కూడా కారెక్కనున్న నేపథ్యంలో తమ పార్టీ శాఖను టీఆర్ఎస్ లో విలీనం చేయనున్నట్లు కూడా ఆ పార్టీ రాష్ట్ర శాఖ ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. నేటి అత్యవసర సమావేశంలో టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించనున్న పొంగులేటి, పాయం వెంకటేశ్వర్లు... రేపు అధికారికంగా గులాబీ కండువాలు కప్పుకోనున్నట్లు సమాచారం.