: బాలుడు ఘటికుడే... ఏడాది పాటు కడుపులో టూత్ బ్రష్ వున్నా బతికాడు!


పిల్లలు పొరపాటున ఏదైనా మింగితే భయంతో పెద్దలకు చెప్పేస్తారు. ఒక వేళ చెప్పకపోయినా కడుపునొప్పి లాంటిది వస్తే అప్పుడన్నా నిజం చెబుతారు. కానీ, ఛత్తీస్ గఢ్ లోని ధంతరీకి చెందిన కేశవ్ సాహూ (5) ఏడాది నరకం అనుభవించినా ఏం జరిగిందో మాత్రం ఎవరికీ చెప్పలేదు. గత ఆరు నెలలుగా కేశవ్ సాహూ ఆహారం తీసుకునేటప్పుడు, మూత్ర విసర్జన సమయంలోను తీవ్రంగా ఇబ్బంది పడడంతో బాలుడ్ని రాయ్ పూర్ లోని మెడికల్ కాలేజీ వైద్యులకు చూపించారు. దీంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలుడి శరీరంలో ఓ వస్తువుతో పాటు 5 సెంటీమీటర్ల రాయిని గుర్తించారు. దీంతో రాయిని తొలగించేందుకు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు రాయితో పాటు 15 సెంటీ మీటర్ల పొడవున్న స్టిక్ ను గుర్తించారు. దానిని వెలికి తీసిన తరువాత అది టూత్ బ్రష్ అని గుర్తించారు. దీంతో ఎప్పుడు మింగావు? అని బాలుడిని అడగగా, తల్లిదండ్రులంటే ఉండే భయం కారణంగా సరిగ్గా చెప్పలేకపోయాడు. అయితే ఆ బ్రష్ ను బాలుడు మింగి ఏడాదిపైనే అయి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో పిల్లలు బతికి బట్టకడం అసాధారణమని వారు పేర్కొన్నారు. జీర్ణాశయం, మూత్రాశయం, పేగులు దగ్గర ఇలాంటి వస్తువులు రంధ్రాలు చేస్తాయని, తద్వారా పిల్లలకు ప్రాణాపాయం ఏర్పడుతుందని వారు తెలిపారు. బాలుడు బతికి బట్టకట్టడం అద్భుతమని వారు చెప్పారు. బాలుడి పేగుల్లో మూడు చోట్ల రంధ్రాలు చేసిన టూత్ బ్రష్ ఎట్టకేలకు మూత్రాశయం చేరిందని వారు తెలిపారు. కొద్ది కాలం బాలుడు తమ పర్యవేక్షణలోనే ఉంటాడని, పూర్తిగా కోలుకున్న తరువాతే డిశ్చార్జ్ చేస్తామని వారు చెప్పారు.

  • Loading...

More Telugu News