: వామపక్షాలతో ఇక పనిలేదు...కేసీఆర్ ఉన్నారు: కవిత
ఎక్కడైనా సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమం చేద్దామని వామపక్షాలు ప్రజలకు పిలుపునిచ్చేవని ఎంపీ కవిత పేర్కొన్నారు. 'మేడే'ను పురస్కరించుకుని హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ఇప్పుడు ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఉద్యమాలకు దిశానిర్దేశం చేసే నేత మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని, అలాంటప్పుడు ఉద్యమం చేయాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. అందుకే తెలంగాణలో వామపక్ష పార్టీల అవసరం లేదని అన్నారు. అలాగే తెలంగాణ ప్రైవేటు పరిశ్రమల్లో కనీసవేతనం అమలు కోసం పోరాడాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. మేడే, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ కార్మికులు కొనసాగించాలని ఆమె ఆకాంక్షించారు. ఆంధ్రాపెత్తందార్లకు వ్యతిరేకంగా చేపట్టిన తెలంగాణ ఉద్యమంలో కార్మికులు మంచి పాత్రపోషించారని ఆమె కొనియాడారు.