: బ్యాంకుల్లో 2 కోట్లు మూలుగుతున్నా...అనాధగానే కాటికి చేరింది!


సంపాదించాలనే యావ ఉన్నప్పటికీ కొందరు తమ చరమాంకం వరకు ఏమీ సంపాదించలేకపోతారు. ఇంకొందరు సంపాదించిన దానిని ఏం చేయాలో తెలియక కాటికి చేరతారు. రాజస్థాన్ లోని అజ్మీర్ లోని నుల్లాహ్ బజార్ కు చెందిన కానక్ లత (70) ఈ రెండో కోవకి చెందుతుంది. నుల్లాహ్ బజార్ లోని ఓ దేవాలయం పక్కనే భిక్షాటన చేస్తూ భర్త ప్రేమ్ నారాయణ్ తో కలిసి ఓ చిన్న గదిలో జీవించేది. రెండేళ్ల క్రితం ప్రేమ్ నారాయణ్ అనారోగ్యం కారణంగా మృతిచెందాడు. అనంతరం పిల్లలు లేని ఆమె ఒంటరిగా ఆ గదిలోనే ఉండేది. స్థానికులు ఇచ్చిన బట్టలు కట్టుకుంటూ, పెట్టింది తింటూ వచ్చింది. గురువారం నుంచి ఆమె బయట కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు గుడిసెలోకి వెళ్లి చూడగా, ఆమె నిర్జీవంగా కనిపించింది. దీంతో స్థానికులే చందాలు వేసుకుని ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం ఆమె గుడిసెలోని పెట్టెలో చూడగా, రెండు కోట్ల రూపాయల విలువైన వివిధ బ్యాంకులకు చెందిన ఫిక్సిడ్ డిపాజిట్లు లభ్యమయ్యాయి. ఆ ఫిక్సిడ్ డిపాజిట్లకు నామినీలు లేకపోవడం విశేషం. అయితే ఇప్పుడు ఆమె మేనల్లుడినంటూ ఛత్తీస్ గఢ్ నుంచి ఓ వ్యక్తి వచ్చాడు. అయితే, అతనిని తామెప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News