: ఫలితమివ్వని కేజ్రీ ప్లాన్... 23 శాతం పెరిగిన కాలుష్యం
మలిదశ సరి-బేసి విధానం ఢిల్లీలో సత్ఫలితాన్ని ఇవ్వలేదు సరికదా, ఏప్రిల్ మూడో వారం ఆరంభంతో పోలిస్తే, 30వ తేదీ నాటికి కాలుష్యం 23 శాతం పెరిగింది. దీంతో బస్ సర్వీసులను పెంచడం, పరిశ్రమలకు అడ్డుకట్ట, కాలుష్య కారకాలను వెదజల్లే వాహనాల అదుపు వంటి అదనపు చర్యలు తీసుకోకుంటే, దీర్ఘకాలంలో సరి-బేసి విధానం పని చేయదని వెల్లడైనట్లయింది. బ్రీత్ ఎయిర్ క్వాలిటీ గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి 14 సరాసరితో పోలిస్తే, ఆపై రెండు వారాల వ్యవధిలో కాలుష్యం గణనీయంగా పెరిగింది. పెరిగిన వేసవి తీవ్రత సైతం కాలుష్యం పెరిగేందుకు కారణమైందని తెలుస్తోంది. కాగా, గత నెల తొలి రెండు వారాల్లో ఘనపు మీటర్ పరిధిలో 56.17 మైక్రోగ్రాముల కాలుష్య కారకాలుండగా, సరి-బేసి విధానం ముగిసేనాటికి అది 68.98 మిల్లీగ్రాములకు పెరిగింది. ముఖ్యంగా ఉదయం పూట వాయు నాణ్యత అత్యంత తక్కువగా ఉందని తెలుస్తోంది. అదే, సాయంత్రం 5 గంటల సమయంలో పీల్చుకునేందుకు అనువైన మంచి గాలులు వీస్తున్నాయని బ్రీత్ ఎయిర్ క్వాలిటీ గణాంకాలు వెల్లడించాయి.