: సిగ్గు లేకుండా పార్టీ మారిన నువ్వా, హోదాను అడిగేది?: టీవీ లైవ్ షోలో జలీల్ ఖాన్ పై బీజేపీ నేత తిట్ల పురాణం
తాము బాధ్యతాయుతమైన నేతలమని, టీవీ చానల్ లైవ్ షోలో పాల్గొంటున్నామని వారు మరచిపోయారు. వ్యక్తిగత దూషణలకు దిగారు. సిగ్గు లేని నేతవంటూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇక రాదని కేంద్రమంత్రి చౌదరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా, ఈ విషయంలో ఓ టీవీ చానల్ కొందరు రాజకీయ ప్రముఖులను భాగం చేస్తూ లైవ్ షో నిర్వహించింది. ఈ షోలో పాల్గొన్న జలీల్ ఖాన్, బీజేపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ పై వ్యక్తిగత దూషణలకు దిగగా, వెల్లంపల్లి సైతం అంతే స్థాయిలో స్పందించారు. "సిగ్గూ, శరం లేకుండా ఓ పార్టీలో గెలిచి మరో పార్టీలోకి మారిపోయిన నువ్వా నన్ను విమర్శించేది? ప్రత్యేక హోదా గురించి అడిగే హక్కు కూడా నీకు లేదు" అని వెల్లంపల్లి తీవ్ర వ్యాఖ్యలే చేశారు. దీనిపై జలీల్ ఖాన్ స్పందిస్తూ, "కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని నువ్వు నన్ననేంతటి వాడివా...?" అంటూ విరుచుకుపడ్డారు. వీరి పరస్పర దూషణలు ఏకవచన సంబోధనలతో శ్రుతిమీరాయి. రాష్ట్రాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందని తెలుగుదేశం, బీజేపీ నేతలు, పాలనా పగ్గాలు చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా ప్రత్యేక హోదాపై నోరు మెదపడం లేదని కాంగ్రెస్ నేతలూ వాదించారు.